బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని.. ఒప్పందం ప్రకారం కవితను అరెస్ట్ చేసి రెండు నెలల్లో విడుదల చేస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువతను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. లిక్కర్ కేసులో కవితను ఇప్పుడు అరెస్ట్ చేసిన వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. కేసీఆర్ తన బిడ్డ కవిత అరెస్ట్ ను సహితం రాజకీయం కోసం ఉపయోగించుకుంటాడని ఆరోపించారు. కిషన్ రెడ్డి వారి నేతల మధ్య ఉన్న గొడవలను మొదట సర్దుబాటు చేసుకోవాలని హితవు పలికారు.
లక్ష కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ పై ఎందుకు ఈడీ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభకు కేసీఆర్ కనీసం స్థలం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముదిరాజులు, గొల్ల కురుమలకు టికెట్లు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ వీధి పోరాటాలు చేస్తుందన్నారు. ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ లో చేరేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఆరు సిక్సర్లుగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుందన్నారు. అభ్యర్థుల విషయంలో అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సీట్లు దొరకని వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీని అభ్యర్థులను ఎంపిక చేస్తుందని తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ తనపని తాను చేస్తుందన్నారు. ఒక్కొక్క చోట ఒకటి రెండు మూడు పేర్లు కూడా సీఈసీకి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసిందని చెప్పారు. అంతిమ నిర్ణయం సీఈసీ తీసుకుంటుందన్నారు. సీఈసీ ఎప్పుడు ఉంటుందనేది కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయిస్తారని తెలిపారు.