AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూత.. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తండ్రి, మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి (78) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి శ్వాస సరిగా ఆడక కార్డియాక్ అరెస్ట్ అయి హరీశ్వర్ రెడ్డి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవలే కోలుకుని ఇంటివద్దే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 10.10 గంటల సమయంలో గుండెనొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హరీశ్వర్ రెడ్డి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

కొప్పుల హరీశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పరిగి నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించింది ప్రజాభిమానం పొందిన నాయకుడు హరీశ్వర్ రెడ్డి అని సీఎం కొనియాడారు. హరీశ్వర్ రెడ్డి కుమారుడు, ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హరీశ్వర్ రెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

హరీశ్వర్ రెడ్డి ఉపసర్పంచ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1985 లో పరిగి నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించాడు. ఆ తరువాత వరుసగా నాలుగు సార్లు 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో పరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అనేక పదవులను అదిరోహించారు. 2012లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కుమారుడు మహేశ్ రెడ్డి పరిగి ఎమ్మెల్యేగా ఉన్నారు. హరీశ్వర్ రెడ్డికి భార్య గిరిజాదేవి, కుమారులు మహేశ్ రెడ్డి, అనిల్ రెడ్డి, కుమార్తె అర్చనారెడ్డి ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10