AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిధులన్నీ ఆ మూడు నియోజకవర్గాలకేనా.. ఈటల

బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లాలోని అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో బీజేపీ జెండా ఆవిష్కరించి, పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదా పాటించమని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. పదవుల కోసం పార్టీ మారారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రులు నిధులకు ఓనర్లు కాదు.. కాపలాదారు మాత్రమేనని, దేశంలోనే తెలంగాణ ధనవంతమై‌న రాష్ట్రమని చెబుతున్న కేసీఆర్.. ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఈటల ప్రశ్నించారు. రైతు రుణమాఫీ ఎందుకు ఇంతవరకు చేయలేదు? కేసీఆర్ రింగ్ రోడ్డు‌ను అమ్ముకున్నడు.. పైసలు లేక మూడు నెలలు ముందే లిక్కర్ టెండర్లు పెట్టారు.. అన్నీ జమచేసినా రైతులకు రుణమాఫీ పైసలు వచ్చాయా? అంటూ ఈటల అన్నారు.

నిధులన్నీ గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లకేనా..? రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల ప్రజలు పన్నులు కడతలేరా అంటూ ఈటల ప్రశ్నించారు. అంతా నీ సిద్దిపేటకే.. సిద్దిపేట మంత్రి వస్తావా చర్చకు అంటూ హరీశ్ రావును ఉద్దేశించి ఈటల సవాల్ చేశారు. నువ్వు రాష్ట్రానికి మంత్రివా? నియోజక వర్గానికా అంటూ ఈటల ప్రశ్నించారు.

తెలంగాణ ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్.. కోకాపేట భూములు అమ్ముకుంటే తప్ప జీతాలు, పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి అంటూ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేను కొత్తగా ఆర్ధిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు లిక్కర్ ద్వారా ఆదాయం 10 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు 45 వేల కోట్లకు చేరింది. అర్థరాత్రి పూట ఊర్లలో మంచినీళ్లు దొరకవుకానీ మద్యం మాత్రం దొరుకుతుంది. రాష్ట్రంలో వ్యవసాయ కరెంట్ 24 గంటలు ఇస్తే ముక్కు నేలకు రాస్తా.. ఇచ్చేది ఎనిమిది, తొమ్మిది గంటలు.. దేశమంతా 24గంటలు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10