మాజీ పీసీసీ చీఫ్, సీనియర్ నేత డి.శ్రీనివాస్ చేరిక అంశం ఆయన కుటుంబం, కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా తాను గాంధీభవన్‌కు వెళ్లానని, కాంగ్రెస్‌లో చేరలేదని డీఎస్ చెబుతుండగా.. తన భర్తకు బలవంతంగా కాంగ్రెస్ నేతలు కండువా కప్పారని ఆయన భార్య విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఆదివారం డీఎస్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. 24 గంటలు గడవకముందు సోమవారం ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదేనని, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు డీఎస్ లేఖ రాశారు. అనారోగ్య కారణాల వల్ల తాను క్రియాశీల రాజకీయాలను దూరంగా ఉన్నానని, ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తెలిపారు. అయితే కుటుంబంలో విబేధాల వల్లే డీఎస్ రాజీనామా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుమారుల విబేధాల మధ్య డీఎస్ నలిగిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో డీఎస్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. విజయలక్ష్మి చేసిన ఆరోపణలను సీనియర్ నేత వీహెచ్ ఖండించారు. తాము కాంగ్రెస్ కండువా కప్పలేదని, ఆయనే కప్పుకున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరుతున్నట్లు డీఎస్ చెప్పారని, పార్టీలో చేరమని తాము కోరలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ వస్తానంటే మానవతా దృక్పథంతో ఆహ్వానించామని, పార్టీలో చేరనప్పుడు కండువా ఎందుకు కప్పుకున్నారని వీహెచ్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను అభాసుపాలు చేయాలని డీఎస్ కుటుంబం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.