AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాత పార్లమెంట్ భవనం ఇకపై సంవిధాన్ సదన్.. ప్రధాని కీలక ప్రకటన

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజు మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. నూతన పార్లమెంట్‌ భవనంలోకి తరలివెళ్లే ముందు ఉభయసభల సభ్యులు పాత భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ వారసత్వంపై ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడారు. ఈ సెంట్రల్‌ హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందని మోదీ తెలిపారు. పాత పార్లమెంట్ భవనం ఇకపై సంవిధాన్‌ సదన్‌ (Constitution House)గా ఉంటుందని ప్రధాని ప్రకటించారు.

‘పార్లమెంట్‌లో ఈ సమావేశం ఎంతో భావోద్వేగంతో కూడుకుంది.. ఈ సెంట్రల్‌ హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షి. మన రాజ్యాంగం ఇందులోనే రూపుదిద్దుకుంది. బ్రిటిషర్ల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా ఈ సెంట్రల్‌ హాల్‌లోనే.. 1952 నుంచి 41 మంది వివిధ దేశాధినేతలు ఇక్కడే ప్రసంగించారు. రాష్ట్రపతులు 86 సార్లు ఇక్కడ తమ ప్రసంగాలను వినిపించారు.. ఇక్కడి నుంచే 4 వేలకుపైగా చట్టాలను ఆమోదించుకున్నాం.. అనేక కీలక చట్టాలకు ఉమ్మడి సమావేశాల ద్వారా ఏకాభిప్రాయం సాధించుకున్నాం. తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్ తలాక్ చట్టాలు ఇక్కడే ఆమోదం పొందాయి.. ఆర్టికల్ 370 నుంచి విముక్తి కూడా పార్లమెంట్ ద్వారానే జరిగింది.. దాంతో ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ శాంతిపథంలో పయనిస్తోంది’ అని ప్రధాని వెల్లడించారు.

ఇదే సమయంలో తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని మోదీ స్పష్టం చేశారు. మా ప్రభుత్వ నిర్ణయాలతో భారత్‌లో కొత్త చైతన్యం వస్తోందని వ్యాఖ్యానించారు. మనం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామో.. ఫలితాలు అంత వేగంగా వస్తాయన్నారు. ‘సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దేశ యువత ముందువరుసలో ఉంది.. ప్రజల ఆకాంక్షలు ఉజ్వలంగా ఎగసిపడుతున్నాయి.. వాటిని అందుకునే ప్రయత్నం నిరంతరం సాగాలి.. అందుకే కాలం చెల్లిన చట్టాలకు ముగింపు పలికి కొత్త చట్టాలను స్వాగతించాలి.. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా పెద్ద మార్పులు తీసుకురాలేం.. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌.. త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’ అని మోదీ తెలిపారు. అలాగే ప్రపంచంలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరత ఉందని, దానిని భారత్‌ పూరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10