తెలంగాణలో ఎన్నికల జాతర మొదలైంది. పథకాలు ప్రాజెక్టులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీడు పెంచితే.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు హైదరాబాద్ కేంద్రంగా వివిధ కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. సెప్టెంబర్ 17 లక్ష్యంగా అన్ని పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. రాష్ట్రానికి ఢిల్లీ నేతల రాకతో విమర్శలు, ప్రతి విమర్శలు, పోస్టర్ల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చారిత్రక దినోత్సవం సందర్భంగా పార్టీలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. తెలంగాణ విమోచన దినోత్సం, విలీన దినోత్సవాల పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు పోటీపడుతున్నాయి.
భాగ్యనగరంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతుండగా.. హైదరాబాద్‌లోనే బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్‌షా కూడా పర్యటిస్తున్నారు. అటు పాలమూరు ప్రాజెక్టు సంబరాల్లో కేసీఆర్ సహా బీఆర్ఎస్ యావత్ నాయకత్వం మునిగిపోయింది. ఎవరి కార్యక్రమాలు వారివే అయినా అందరి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే అన్నది బహిరంగ రహస్యం. సెప్టెంబర్ 17న చారిత్రక దినాన్ని పొలిటికల్ మైలేజీ కోసం అన్ని పార్టీలు పోటీపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా స్పీడు పెంచిన పార్టీలు జనాల దృష్టి ఆకర్షించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తెలంగాణ కేంద్రంగా ఓట్ల వేటలో పడ్డారు ఆయా పార్టీల అగ్రనేతలు.
కర్నాటక విజయాన్ని తెలంగాణలోనూ కొనసాగించాలని కాంగ్రెస్ పెద్దలు పట్టుదలగా ఉన్నారు. అదే లక్ష్యంగా అన్నట్లు.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలను కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. మొత్తం రెండు రోజులు నగరంలోనే మకాంవేసి తెలంగాణ కేడర్‌లో జోష్ నింపనున్నారు. తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రత్యేకత కలిగిన సెప్టెంబర్17న భారీ సభతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎన్నికల శంఖారావం మోగించబోతున్నారు. తుక్కగూడలో జరిగే బహిరంగ సభలో ఎన్నికలు వరాలు ప్రకటించబోతున్నారు సోనియాగాంధీ. ఇదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకోనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరారు.
మరోవైపు బీజేపీ కూడా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే నగరానికి చేరుకుంటున్న అమిత్‌షా రేపు(ఆదివారం) పరేడ్ గ్రౌండ్‌లో జరిగే సభలో ప్రసంగించబోతున్నారు. తెలంగాణలోని బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనున్నారు.