రాష్ట్రంలో మరో మూడు నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం నుంచి బుధవారం వరకు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వివరించింది.
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణ వర్షపాతం 77.3 మి.మీ. ఉండగా.. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 150.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతంతో పోలిస్తే 95 శాతం అధికమని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరిలో 211 శాతం అధిక వర్షపాతం నమోదైంది.