‘హరీష్ రావు.. ఖమ్మం జిల్లా నీ జాగీరు కాదు… కేసీఆర్‌ది అంతకన్నా కాదు. ఇది ఎంతో చైతన్యవంతమైన జిల్లా. దొరల జిల్లా కాదు. ఇది సిద్ధిపేట కాదు. మీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడి ప్రజలు, మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం సరికాదు. నువ్వు ప్రారంభోత్సవానికో.. శంకుస్థాపనకో వచ్చిపోతావ్.. నీకు ఏంతెలుసు ఇక్కడి రాజకీయం గురించి. నీకిచ్చిన ఉద్యోగాన్ని సక్రమంగా చేసుకో..’ అంటూ సీఎల్పీ నేత, ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు గురువారం తన ఖమ్మంజిల్లా పర్యటనలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఖమ్మంజిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మాట్లాడితే 90సీట్లు తమవేనంటున్నారని, కానీ తెలంగాణ ప్రజల తీర్పు మరోలా ఉండబోతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో డాక్టర్, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలని, ఇప్పటికే ప్రజలు వైద్యసేవలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హరీష్ తనకు ఇచ్చిన ఉద్యోగాన్ని సరిగ్గా చేయాలని, ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడటం సరికాదని, ఆయన వల్ల ఖమ్మం జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామ్య రాష్ట్రమని, ఎవరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. అనంతరం ముదిగొండ మండలం పెద్దమండవ జోన్ బూత్‌స్థాయి సమావేశానికి హాజరైన భట్టి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.