కేరళలో కలకలం సృష్టిస్తున్న నిఫా వైరస్ పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ నియంత్రణకు రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కేరళలలోని వివిధ జిల్లాలలో ఉన్న లేబరేటరీలకు ఈ నిధులు విడుదల చేస్తూ వైరస్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ శుక్రవారం ఓ మీడియా సంస్థకు వివరాలు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు బాధితులకు అవసరమైన చికిత్స అందించడం, వైరస్ నియంత్రణ చర్యలకు ఈ నిధులు ఉపయోగించాలని అధికారులకు మంత్రి సూచించారు.
కేరళలో తాజాగా మరొకరికి నిఫా వైరస్ సోకినట్లు గుర్తించామని మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో కేరళలో నిఫా బాధితుల సంఖ్య ఆరుకు చేరిందన్నారు. వైరస్ బారిన పడి ఇప్పటికే ఇద్దరు చనిపోయారని వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిఫా వైరస్ నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైరస్ కేసులు బయటపడ్డ గ్రామాలతో పాటు చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో కంటైన్ మెంట్ ప్రకటించామని మంత్రి చెప్పారు. వైరస్ వ్యాప్తి విషయంలో ప్రభుత్వాలు అలర్ట్ గా ఉన్నాయని, ప్రజలు భయాందోళనలకు లోనవ్వాల్సిన అవసరంలేదని మంత్రి ధైర్యం చెప్పారు.