ఇప్పటివరకు పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి గుడ్ న్యూస్. పాన్ ఆధార్ లింకింగ్ (PAN Aadhaar Linking) గడువును జూన్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి పాన్ ఆధార్ లింక్ చేయనివారికి మరో మూడు నెలల గడువు లభించినట్టైంది. పన్ను చెల్లింపుదారులకు ఇంకొంతకాలం సమయం ఇచ్చేందుకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఆధార్ నెంబర్‌ను 2023 మార్చి 31లోగా పాన్ కార్డుకు (PAN Card) లింక్ చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆధార్ నెంబర్ లింక్ చేయని పాన్ కార్డులు చెల్లవని హెచ్చరించింది. ఈ గడువును 2023 జూన్ 30 వరకు పొడిగించింది.
తాజా నిర్ణయంతో పాన్ కార్డ్ హోల్డర్స్‌కి మరో మూడు నెలల గడువు లభించింది. 2023 జూన్ 30 లోగా ఆధార్ నెంబర్ లింక్ చేయకపోతే, 2023 జూలై 1 నుంచి వారి పాన్ కార్డ్ చెల్లదు. పాన్ కార్డ్ చెల్లకపోతే పలు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పాన్ కార్డులకు సంబంధించి ఏవైనా రీఫండ్స్ రావాల్సి ఉంటే వాటిని చెల్లించరు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టీడీఎస్, టీసీఎస్ ఎక్కువగా వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. రూ.1,000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్ లింక్ చేస్తే 30 రోజుల్లో పాన్ కార్డ్ యాక్టీవ్ అవుతుంది.