కర్ణాటక ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఇంచార్జి ప్రకాష్ రాథోడ్
ప్రజా సేవాభవన్ ను సందర్శించిన కర్ణాటక ఎమ్మెల్సీ
ఘన స్వాగతం పలికిన కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని తుక్కుగూడ లో ఈనెల 17న నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ పార్లమెంటరీ ఇన్‌చార్జి, కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాలులో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సర్వే ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని, కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చే అవకాశం మెండుగా ఉందని తెలిపారు. పార్టీ మండల, బ్లాక్, బూత్ లెవల్ కమిటీలు పూర్తి చేసి క్షేత్రస్థాయిలో పటిష్టపర్చాలని అన్నారు. తెలంగాణలో విజయం సాధించి సోనియాగాంధీకి బహుమతిగా ఇవ్వాలన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని, దేశంలో కూడా మంచి అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. నిత్యం జనంలోనే ఉంటూ కాంగ్రెస్ డిక్లరేషన్‌పై ప్రజలకు వివరించాలని, వారిని చైతన్య వంతం చేయాలని అన్నారు. ఓటరు జాబితాను తీసుకుని నకిలీ ఓటర్లను గుర్తించాలని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి తొలగించేలా చూడాలన్నారు. అర్హులైనవారి పేర్లను ఓటరు జాబితాలో పేరు నమోదు చేయించాలన్నారు. గెలుపు గుర్రాలకు టికెట్ వస్తుందని, ఎవరికి వచ్చినా అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందరికీ మరిన్ని అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకున్నవారందరితో విడివిడిగా భేటి అయ్యి వారితో చర్చించారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన క్యాంపు కార్యాలయం ప్రజా సేవాభవన్ ను సందర్శించారు. ఆయన ఇచ్చిన తేనీటి విందును స్వీకరించారు.ఆయన వెంట టీపీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ హాజరయ్యారు.