ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు (సెప్టెంబర్ 15) విచారణ హాజరు కావాలని తాజాగా సమన్లు జారీ చేశారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారిన తర్వాత కవితను మరోసారి విచారణకు పిలవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాను కవితకు బినామీ అని గతంలో అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తోంది. శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ ఆరోరా, రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. దీంతో ఈడీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత విచారణ కీలకంగా మారనుంది. ఇప్పటికే కవిత ఓసారి ఈడీ విచారణకు వెళ్లి వచ్చారు. ఈ ఏడాది మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు రోజులు కవితను ఈడీ అధికారులు రోజంతా విచారించారు. అప్పట్లో ఉదయం ఈడీ ఆఫీసుకు వెళ్లిన కవిత.. రాత్రి వరకు ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఆమె ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. తనను విచారించే విధానంపై ఆమె సుప్రీం కోర్టుకు సైతం వెళ్లారు.
అప్పట్లోనే కవిత అరెస్టు కాబోతున్నారని ప్రచారం జరగ్గా.. ఆ తర్వాత ఈ కేసు చల్లబడింది. తాజాగా తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటం, ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయటం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.