సొంత తండ్రే తనను లైంగికంగా వేధించారని బయటి ప్రపంచానికి చెప్పినందుకు తానేమి సిగ్గు పడటం లేదని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) చెప్పారు. తాను ఎదుర్కొన్న సంఘటన గురించి మాత్రమే చెప్పానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
‘నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా అందరికి తెలియజేశాను. అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఈ విషయాన్ని చెప్పినందుకు సిగ్గుపడటం లేదు. నాకు జరిగిన దారుణాన్ని చెప్పడానికి ఇంత సమయం తీసుకున్నాను. ప్రతి మహిళ తమకు ఎదురైన వేధింపులను వెల్లడించి.. ధైర్యంగా ముందుకు సాగాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ప్రోత్సహించకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి’అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.
అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకల్లో భాగంగా ఇటీవల ఝార్ఖండ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఖుష్బూ మాట్లాడారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు. నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదురించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని చెప్పారు.