AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజయ్య కొత్తరాగం.. కడియంకు చిక్కులు?.. రసవత్తరంగా ‘స్టేషన్’ రాజకీయం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్‌ వాతావరణం రసవత్తరంగా మారింది. సీఎం కేసీఆర్‌ అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించగా.. కొందరు సిట్టింగ్‌లకు సీట్లు ఖరారు కాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో తాజా హాట్ టాపిక్ స్టేషన్ ఘన్‌పూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను కాదని.. కడియం శ్రీహరికి టికెట్ కేటాయించారు. రాజయ్య తీరుపై అసంతృప్తిలో ఉన్న అదిష్ఠానం ఆయన్ను కాదని కడియంకు టికెట్ కేటాయించింది. అయితే.. బీఆర్ఎస్ టికెట్ దక్కినా.. కడియం శ్రీహరికి టెన్షన్ తప్పడం లేదు. రాజయ్య తీరు కడియంకు తలనొప్పిగా మారింది. మాదిగ సెంటిమెంట్‌తో కొత్త రాగం ఎత్తుకున్న రాజయ్య.. కడియంకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు.

స్టేషన్‌ ఘన్పూర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ మాలలతో పోలిస్తే మాదిగల ఓట్లే ఎక్కువ. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 17 వేల పైచిలుకు ఓట్లు ఉండగా ఇందులో 85 వేల ఓట్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవి. వీటిలో మాదిగల ఓట్లు సుమారు 70 వేల వరకు ఉండగా.. మిగిలిన ఉపకులాలవి 15 వేల వరకు ఉంటాయి. కడియం శ్రీహరి ఎస్సీ ఉపకులమైన బైండ్ల సామాజిక వర్గానికి చెందినవారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. మాదిగ దండోరా నుంచే ఆయన తన రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పుకుంటారు. రాజయ్యకు సపోర్టుగా ఇటీవల మందకృష్ణ మాదిగ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

అయితో కడియంపై రాజయ్య దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ఆయనపై విమర్శలు చేస్తూ.. ప్రజల్లో ఉంటున్నారు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. మాదిగల అస్తిత్వం.. ఆత్మగౌరవం పేరిట ఇటీవల హన్మకొండలో జరిగిన మీటింగ్కు రాజయ్య హాజరు హాజరయ్యారు. అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కీలక నేత దామోదర రాజనర్సింహా ఆయన భేటీ కావటంతో పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ నుంచి రాజయ్య బరిలో ఉండడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. అదే జరిగితే కడియం శ్రీహరికి ఓటమి తప్పదని కొందరు అంటున్నారు. అభ్యర్థుల విజయావకాశాలపై మాదిగలు తీవ్ర ప్రభావం చూపుతారని.. మాదిగల ఓట్లు ఎటు ఎక్కువ పడితే వారిదే పై చేయి కానుందని అంటున్నారు.

రాజయ్య దూకుడుగా వ్యవహరిస్తున్నా.. కడియం మాత్రం మౌనం వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించిన తర్వాత రెండు రోజులకు నియోజకవర్గ కేంద్రానికి భారీ ర్యాలీగా వచ్చిన కడియం ఆ తర్వాత హడావుడి చేయటం లేదు. హైకమాండ్ సూచనలతోనే కడియం సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఖరారు కాక ముందు తరచూ మాటల తూటాలు పేల్చిన కడియం..ఆ తర్వాత మౌనం వహించటం వెనుక హైకమాండ్ ఆదేశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10