AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. ప్రాజెక్టులకు వరదలు

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం చాలా ప్రాంతాల్లో ముసురుతో కూడిన మోస్తరు వానలు పడ్డాయి. ఖమ్మం, నిజామాబాద్‌, హైదరాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. వానలతో ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. నెల రోజుల విరామం తర్వాత శ్రీశైలానికి బుధవారం వరద ప్రవాహాలు నమోదయ్యాయి. ఆగస్టులో వర్షాలు పడకపోవడంతో ఎగువ నుంచి వరద నిలిచిపోయింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి 16,748 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను 82.76 టీఎంసీలున్నాయి.

ఇక ఆల్మట్టి ప్రాజెక్టుకు 784 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. నారాయణపూర్‌ వద్ద 21,667 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా ప్రాజెక్టులో 29.80 టీఎంసీలున్నాయి. తుంగభద్ర వద్ద 1,191 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. జూరాలకు ప్రస్తుతం 38,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా విద్యుత్‌ కేంద్రంలో ఐదు యూనిట్ల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తూ శ్రీశైలం వైపు 39,990 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జూరాల మొత్తం ఔట్‌ఫ్లో 40,676 క్యూసెక్కులుగా ఉంది.

ఎస్సారెస్పీకి పోటెత్తుతున్న వరద..
నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)కు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి 60 వేల 265 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. దీంతో 21 వరద గేట్ల ద్వారా 70 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 48 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఆరు గేట్లు ఎత్తి మంజీరాలోకి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులోకి 39,716 క్యూసెక్కుల వరద వస్తుండడంతో.. రెండు గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బ్యారేజీకి 3,07,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతోంది. దీంతో బ్యారేజీ 85 గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక హైదరబాద్‌ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద చేరుతోంది. దీంతో రెండు జలాశయాల ఆరు చొప్పున 12 గేట్లను ఎత్తి 6,148 క్యూసెక్కుల వరదను మూసీలోకి వదులుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10