బీజేపీ నాయకురాలు, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె రాజకీయాల్లోకి ప్రవేశించారు. సుష్మా కుమార్తె బాన్సురీ స్వరాజ్ ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో- కన్వీనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తోన్న బాన్సురీకి రాజకీయాల్లో ఇది తొలి అడుగుగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన వీరేంద్ర సచ్దేవ.. బాన్సురీని పార్టీ లీగల్ సెల్ నియమించారు. ఈ నియామకంపై సుష్మా తనయ ట్విట్టర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా సహా బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘గతంలోనూ నేను పార్టీకి న్యాయపరంగా సహాయం చేశా.. ఇది కేవలం అధికారికంగా అవకాశం ఇవ్వడం లాంటిది.. పార్టీకి సేవ చేయడానికి అవకాశం వచ్చింది.. ఢిల్లీ బీజేపీ లీగల్ డిపార్ట్మెంట్ కో-కన్వీనర్‌గా క్రియాశీలంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, వీరేంద్ర సచ్దేవకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.
సుష్మా స్వరాజ్ ఏకైక సంతానమైన బాన్సురీ.. తండ్రి స్వరాజ్ కౌశల్ బాటలోనే నడిచి క్రిమినల్ లాయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఢిల్లీ బార్ కౌన్సిల్లో సభ్యత్వం ఉన్న బాన్సురీకి న్యాయవాదిగా 16 ఏళ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులను వాదిస్తున్నారు. ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో బీఏ ఆనర్స్.. లండన్‌లోని బీపీపీ లా స్కూల్ నుంచి న్యాయవాద వృత్తిని అభ్యసించారు. ‘బారిస్టర్ ఎట్ లా’లో అర్హత సాధించిన ఆమె.. లండన్ ‘ఇన్ ఆఫ్ ఇన్నర్ టెంపుల్’ బార్ అసోసియేషన్‌లో చేరారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లోని సెయింట్ కేథరిన్స్ కళాశాలలో మాస్టర్స్ చదివారు.