ఢిల్లీ: పోలవరం (Polavaram)పై కేంద్ర ప్రభుత్వం (Central Govt) మళ్లీ మాట మార్చింది. పోలవరంపై పదే పదే కేంద్రం భిన్నమైన ప్రకటనలు చేస్తోంది. ఈ రోజు (సోమవారం) రాజ్యసభలో ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం పురోగతిపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) ప్రశ్నలు లేవనెత్తారు. కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు (Union Minister Bisweshwar Tudu) లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (Godavari Tribunal Award)ప్రకారం.. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు.. నీటి నిల్వ సామర్ధ్యం 41.15 కి తగ్గించాలంటూ ఏపీ ప్రతిపాదించినట్టు తమకు సమాచారం లేదని తెలిపారు. ఇటీవలే పార్లమెంటు సాక్షిగా పోలవరం మొదటి దశలో 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇంతలోనే కేంద్రం మాట మార్చింది. ఇటీవల అసెంబ్లీలో సీఎం జగన్ కూడా మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూర్ దగ్గరే నీటి నిల్వ చేస్తామని ప్రకటించారు.
మరోవైపు ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కనబడడంలేదు. కేంద్రం, రాష్ట్రం ఈ ప్రాజెక్టు విషయాన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పూర్తి కావలసిన ప్రాజెక్టు రకరకాల కారణాలతో నత్తనడకన నడుస్తోంది. ఇంత వరకూ ప్రధాన ప్రాజెక్టు ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్‌డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) డిజైన్లు సిద్ధం కాలేదు. గత టీడీపీ ప్రభుత్వం ఈసీఆర్‌ఎఫ్‌కు సంబంధించి డయా ఫ్రం వాల్ (Dia from wall) నిర్మాణం కూడా పూర్తి చేసింది. నది లోపలకు కాంక్రీట్ పంపించి, సుమారు 20 మీటర్ల నుంచి 30 మీటర్లు, దానికిపైగా కూడా నది లోపల ఈ డయా ఫ్రం వాల్ నిర్మించారు. దీనిపైనే ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాల్సి ఉంది. ఇంత వరకూ దీనిజోలికి వెళ్లలేదు. చంద్రబాబు హయాంలోనే సుమారుగా పూర్తయిన స్పిల్‌వేకు గేట్లు పూర్తిగా పెట్టారు. స్పిల్‌వే కాంక్రీట్, రేడియల్ గేట్లు (Spillway Concrete, Radial Gates), రివర్ స్లూయిజ్ గేట్ల పని పూర్తయింది. అప్రోచ్ చానల్ పనులు మాత్రం ఇంకా 36.54 శాతం మిగిలి ఉంది. గత టీడీపీ హయాంలో మొదట స్పిల్‌వే, ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించి, గ్రావెటీ ద్వారా కాలువలకు నీరివ్వాలనే ఆలోచన ఉంది. ఆ తర్వాత దిగువ కాఫర్ డ్యామ్ కూడా పూర్తి చేసి ప్రధాన డ్యామ్ ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలనేది అప్పటి ఆలోచన. అప్పుడు ప్రతి సోమవారం పోలవరం అనే నినాదంతో అత్యంగా వేగంగా పనులు జరిగిన సంగతి తెలిసిందే.