AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బస్సుపై ఏనుగు దాడి.. భయంతో ప్రయాణికుల పరుగులు

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగులు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లాలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు భార్యాభర్తలపై దాడి చేసి చంపేయగా.. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగు బస్సుపై దాడి చేసింది. రహదారిపై బీభత్సం చేసింది. ప్రయాణికులను పరుగులు తీయించింది. పార్వతీపురం – రాయగడ ప్రధాన రహదారిపై కొమరాడ మండలం ఆర్తాం గ్రామం వద్ద ఒంటరి ఏనుగు బీభత్సం చేసింది. రోడ్డుకు అడ్డంగా నిల్చుని వాహనాలను ఆపేసింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేట్ బస్సు మీదకు వెళ్లి దాడికి దిగింది. తొండంతో ఒక్క ఉదుటన బస్సు అద్దాలను పగులగొట్టింది. బస్సును అమాంతం వెనక్కి తోసేసింది. బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. బస్సు బోల్తా పడుతుందేమోనని భయపడ్డారు.

బస్సులోని ప్రయాణీకులు కిందికి దిగి దూరంగా పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆ ఏనుగు ఓ ప్రయాణికుడి వెంట పడింది. ఏనుగు దాడి నుంచి అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. కర్రలతో సహాయంతో బెదిరిస్తూ ఏనుగును తరిమేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. అది అస్సలు బెదరకపోగా.. మరింత రెచ్చిపోయింది.

అక్కడే ఉన్న గ్రామ (ఆర్తాం) సచివాలయంపై ఏనుగు దాడి చేసింది. అక్కడ పార్క్ చేసి ఉన్న రెండు బైకులను ధ్వంసం చేసింది. అటూ ఇటూ తిరుగుతూ అందరినీ హడలెత్తించిన ఆ గజరాజం.. కాసేపటి తర్వాత పంట పొలాల మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10