టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు. బుమ్రా సతీమణి సంజన ఈరోజు (సెప్టెంబర్ 4న) పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్‌ను సోషల్ మీడియా వేదికగా బుమ్రా వెల్లడించాడు. ఈ సందర్భంగా బుమ్రా తన కుమారుడి పేరును సైతం వెల్లడించాడు. తన కొడుక్కి ‘అంగద్ జస్‌ప్రీత్ బుమ్రా’గా పేరు పెట్టినట్లు వెల్లడించాడు.
“మా చిన్న కుటుంబం పెరిగింది. ఈ ఉదయం మేం మా లిటిల్ బాయ్ అంగద్ జస్ప్రీత్ బుమ్రాను ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. మా జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది” అని జస్‌ప్రీత్ బుమ్రా-సంజన పేర్లుతో కూడిన సందేశాన్ని బుమ్రా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తను, తన భార్య కలిసి చిన్నారి చేతిని పట్టుకున్న ఫొటోను బుమ్రా తన అభిమానులతో పంచుకున్నాడు.
బుమ్రా గుడ్ న్యూస్ చెప్పడంతో పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కంగ్రాట్స్ బుమ్రా అంటూ పోస్టులు పెడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే, దినేశ్ కార్తీక్ తదితరులు బుమ్రాకు విషెస్ తెలిపారు. యార్కర్లు సంధించడంలో మాస్టర్‌వైతే సరిపోదు.. ఇకపై డైపర్లు మార్చడంలోనూ మాస్టర్‌వి కావాలంటూ దినేశ్ కార్తీక్ సరదాగా కామెంట్ చేశాడు.
ఇక ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచు ఆడిన అనంతరం బుమ్రా తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. తన భార్య ప్రసవం సమయంలో ఆమె వద్ద ఉండేందుకు బుమ్రా స్వదేశానికి వచ్చాడు. దీంతో నేడు నేపాల్‌తో జరగనున్న మ్యాచుకు దూరమయ్యాడు.