తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR)కు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో నిరసన సెగ తగిలింది. ఇవాళ ఆయన నియోజకవర్గ పర్యటనకు వెళ్లగా.. ఏబీవీపీ (ABVP) కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులకు న్యాయం చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేటీఆర్ కారుకు అడ్డుపడి నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను పక్కకు తీసుకెళ్లారు. దీంతో కేటీఆర్ కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. నిరసన తెలిపిన ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పదిర గ్రామంలో దళితబంధు పథకం లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్, లింగయ్య అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్న రైస్ మిల్లును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల చొప్పున ముగ్గురికి రూ. 30 లక్షలు మంజూరు చేయగా.. బ్యాంకు రుణాన్ని మరియు ప్రభుత్వ పారిశ్రామిక రాయితీలను పొంది వారు ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.