AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2 గంటల్లో కూతురి పెళ్లి.. అంతలోనే కుప్పకూలిన తండ్రి..

చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన కూతురిని.. అంతకంటే గొప్పగా చూసుకునే అబ్బాయికిచ్చి కాళ్లు కడిగి కన్యాదానం చేయాలని ప్రతి తండ్రి కోరిక. ఆ తండ్రికి కూడా అదే కోరిక. అందుకోసం.. ఎన్నో సంబంధాలు వెతికి తన గారాలపట్టికి ఓ మంచి అల్లున్ని చూశాడు. కన్యాదానం చేసేందుకు ఓ మంచి ముహూర్తం కూడా పెట్టించాడు. గుండెల మీద పెట్టి పెంచిన తన కూతురుని అల్లుని చేతిలో పెట్టే సమయం రానే వచ్చింది. ముహూర్తానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది. పెళ్లి మండపమంతా.. బంధువులతో హడావిడిగా ఉంది. వధూవరులు పెళ్లి బట్టలతో మండపంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతా సంతోషంగా ఉన్న సమయంలో.. ఒక్కసారిగా ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో.. అప్పటివరకు ఉన్న సంతోష క్షణాలు అన్నీ ఆవిరైపోయి.. ఆర్తనాదాలు ఆవరించుకున్నాయి. పెద్ద దిక్కే తనువు చాలించడంతో బంధుమిత్రుల రోదనలతో పెండ్లిల్లు దద్దరిల్లింది. మాటలకందని ఈ విషాదం.. ఆదివారం రోజున కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎర్రల రాములు (48) ట్రాక్టర్‌ మెకానిక్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాములుకు ముగ్గురు కూతుళ్లు కాగా… పెద్ద కూతరు లావణ్య వివాహం ఆదివారం ఉదయం పది గంటలకు.. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి గుట్టపై జరగాల్సి ఉంది.

అయితే.. మరో రెండు గంటల్లో పెళ్లి జరగాల్సి ఉందనగా.. రాములుకు చాతిలో నొప్పి వస్తుందంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన బంధువులు హూటాహుటిన హుజూరాబాద్‌ ప్రభుత్వ దవఖానకు తరలించారు. రాములును పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించాడని వెల్లడించారు. రాములు మరణంతో భార్యాబిడ్డలు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎంతో ఆనందంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఈ ఊహించని ఘటనతో.. తీరని విషాదం నిండింది. పెళ్లి వాయిదా పడింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10