సీఎం కేసీఆర్ నాయకత్వం, నియోజక వర్గ ప్రజల పక్షాన అభివృద్ధి పనులు తాను చేసుకుంటూ పోతే, మనం చేసిన పనులనే వేరేవారు చేశానని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఉందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని నమిలిగొండ శివారులో 2కోట్ల 65లక్షల వ్యయంతో నిర్మించిన మినీ క్రీడా స్థలాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ మారపాక రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..మరోమారు పరోక్షంగానే కడియం శ్రీహరి పై కీలక వ్యాఖ్యలు చేశారు.
పనులు చేసి నిత్యం ప్రజల్లో ఉండేది ఒకరైతే, ఎక్కడో ఉండి పనులు చేశానని చెప్పడం సరైనది కాదన్నారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ గతంలోనే అయ్యేదని, మున్సిపాలిటీ కాకుండా ఎవరు అడ్డుపడ్డారో ప్రజలకు తెలుసునని, సొమ్ము ఒక్కడిదైతే, సోకు ఒకరిదన్న చందంగా తయారైందని ఎద్దేవా చేశారు. ఇక్కడే పుట్టానని ఇక్కడే పెరిగి, విద్య ద్వారానే ఈ స్థాయికి వచ్చానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమ సమయంలో 18 ఎస్సై, 7సీఐల పహారాలో కస్తూర్బా, మోడల్, మైనార్టీ సంక్షేమ పాఠశాలలకు శంఖు స్థాపన చేశానని, ఉన్నత చదువు చదివి, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి మంచి పేరు తీసుకొచ్చే స్థాయికి ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.