AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీపీఆర్‌పై అవగాహన కల్పించాలి: మంత్రి హరీశ్

ఇటీవల కాలంలో సమయం, సందర్భం, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమని.. మన కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నామని చెప్పారు. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ పై అవగాహన కల్పించాలని, శిక్షణ ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు… సంగారెడ్డి కలెక్టరేట్‌లో CPRపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సడెన్ కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ రెండూ ఒకటే అని చాలా మంది అనుకుంటారని.. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం అవి రెండూ వేర్వేరు అని హరీశ్ రావు వెల్లడించారు.

సడెన్ కార్డియాక్ అరెస్ట్.. అంటే అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు జరిగినప్పుడు మనిషి సైక్లాజికల్ షాక్‌కు గురవుతాడని చెప్పారు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుందని… గుండె లయ తప్పి ఆగిపోతుందని చెప్పారు. మనిషి స్పందించక.. శ్వాస ఆగిపోతుందని చెప్పారు. ఆ సమయంలో గుండె కొట్టుకునేలా ఛాతి మీద పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం వల్ల గుండె మరియు ఊపిరితిత్తులు తిరిగి పని చేస్తాయి. దీన్నే సీపీఆర్ (CPR) అంటారని చెప్పారు. ఇంత చేసినా కొన్ని సార్లు గుండె స్పందించదని.. ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డెఫిబ్రిలేటర్స్ (AED) అనే వైద్య పరికరం ద్వారా ఛాతి నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి పని చేసేలా చేయడం సాధ్యమవుతుందని అన్నారు. సీపీఆర్ తెలిసిన వారు ఉంటే సీపీఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10