AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

26న చేవెళ్లలో ప్రజాగర్జన సభ

– హాజరుకానున్న మల్లిఖార్జున ఖర్గే
– 29న వరంగల్‌లో మైనార్టీ డిక్లరేషన్‌
– ఓబీసీ, మహిళా డిక్లరేషన్‌ కోసం సబ్‌ కమిటీ
– సోనియాగాంధీ చేతుల మీదుగా ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
– ప్రతీ గడపకూ చేరాలి… ప్రతీ తలుపూ తట్టాలి
– టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం
ఎన్నికలకు కాంగ్రెస్‌ వడివడిగా అడుగులేస్తున్నది. అందులో భాగంగా వివిధ వర్గాలకు సంబంధించిన డిక్లరేషన్లు విడుదల చేయాలని టీపీసీసీ విస్తృతస్థాయి కమిటీ సమావేశం నిర్వహించింది. ఎన్నికల తుది మ్యానిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. ఈనెల 26న సాయంత్రం నాలుగు గంటలకు చేవెళ్ల ప్రజా గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించాలని తీర్మానించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నట్టు టీపీపీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.

చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను విడుదల చేస్తారని వివరించారు. ఈ నెల 21 నుంచి 25 వరకు శాసనసభ నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘తిరగబడదాం… తరిమికొడదాం’ అనే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాలను ప్రతీ గడపకు పోవాలనీ, ప్రతీ తలుపు తట్టేలా చూడాలని కోరారు. ఇందుకోసం నియమించిన పార్లమెంట్‌ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు ప్రయత్నం చేయాలని సూచించారు. ఈనెల 29న మైనార్టీ డిక్లరేషన్‌ను వరంగల్‌లో విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్‌ కమిటీని నియమిస్తామన్నారు. మహిళా డిక్లరేషన్‌ సభకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీని ఆహ్వానిస్తామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నెలరోజులపాటు విస్తృతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, ఆ తర్వాత కాంగ్రెస్‌ ఏం చేయబోతుందో ప్రజలకు వివరిస్తామన్నారు. అనంతరం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై మరో చార్జిషీట్‌ విడుదల చేస్తామని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10