దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో మరో కొత్త పథకం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ‘కొత్త ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవరి తరమూ కాదు. మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం తీసుకురాబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నాం. పట్టణాల్లోని దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నాం. రూ.లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తాం’ అని ప్రధాని వ్యాఖ్యానించారు.
అలాగే, సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి రోజున విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ పథకం కింద నాయీ బ్రాహ్మణులు, చర్మకారులు, కమ్మరి, ఇతర కులవృత్తుల వారికి రూ. 13,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్ల వరకు బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం.. కళాకారులు.. కళా ఉత్పత్తులు, సేవల నాణ్యత, స్థాయిను మరింత మెరుగుపరచడం.. దేశీయ, ప్రపంచ సరఫరా గొలుసుతో వారిని ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు చెందిన కార్మికుల ఆర్థిక సాధికారతకు ఈ పథకం సహాయపడుతుంది.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల దృష్టిలో ఉంచుకుని మోదీ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఇక, వరుసగా పదోసారి ఎర్రకోట నుంచి జెండా ఎగురువేసిన మోదీ.. మన్మోహన్ సింగ్ రికార్డును సమం చేశారు. అంతేకాదు, ఈ ఘనత సాధించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగానూ మరో ఘనత సాధించారు. కాగా, దేశంలో ప్రస్తుతం 10 వేల జన ఔషధి కేంద్రాలు ఉన్నాయని, వీటిని 25 వేలకు పెంచనున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.