రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో మయన్మార్, బంగ్లాదేశ్ సమీపంలోని మేఘాలు తెలుగు రాష్ట్రాలను ఆవరించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక నేడు, రేపు కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్, మల్కాజిగిరి, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు ఆవర్తన ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆవర్తన ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుందని పేర్కొంది. ఐతే రాయలసీమపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. చెన్నై సమీపంలోని బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని, అది బలపడిదే రాయలసీమలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.