AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాడు అనాథ.. నేడు స్ఫూర్తిదాత.. రుద్ర రచన ఎందరికో ఆదర్శం!

అ అమ్మాయికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. తెలిసీ తెలియని వయస్సులోనే అనాథగా మిగిలింది. బంధువుల సాయంతో చదువును కొనసాగించింది. చదవు కొనసాగించాలని ఉన్నా.. ఉన్నత చదువులు చదవలేని పరిస్థితి. ఆమె పరిస్థితి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. బీటెక్ పూర్తయ్యే వరకు వెన్నంటే ఉన్నారు. మంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె తన చదువును పూర్తి చేసింది. ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో జాబ్ కూడా సాధించింది. అక్కడితో ఆగిపోకుండా తనలాంటి అనాథలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా తన సాలరీలో నుంచి రూ. లక్ష సీఎం సహాయ నిధికి అందజేసింది. తన గొప్ప మనసు చాటుకుంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేసి ఆ అమ్మాయిపై ప్రశంసలు కురిపించారు.

వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం తండ్రియాల్‌ గ్రామానికి చెందిన రుద్ర రచనకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. మంత్రి కేటీఆర్ అండతో తాను చదువును కొనసాగించి ఉద్యోగం సంపాదించినట్లు ఓ ట్వీట్ చేసింది. “‘తల్లిదండ్రులు లేని నాకు కేటీఆర్‌ అండగా నిలిచారు. బీటెక్‌ పూర్తి చేసిన నేను ఇటీవలే ఉద్యోగాన్ని సంపాదించా. నా వేతనంలో రూ.లక్షను సీఎం సహాయ నిధికి అందజేశా. మంత్రి కేటీఆర్‌ చేసిన సాయాన్ని ఎప్పటికీ మరువలేను” అంటూ ఆమె సోమవారం ట్వీట్‌ చేసింది.

ఆమె చేసిన ట్వీట్‌పై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్.. రీట్వీట్‌ చేశారు. “ఎంత అద్భుతమైన ఆలోచన. చాలా గొప్ప పని చేశావు రచన. నీ ట్వీట్‌ చూసి నా మనసు ఆనందంతో నిండిపోయింది” అని మంత్రి కేటీఆర్ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చదువు కోసం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందుకుంటున్న రచన ఫొటోను, బీటెక్‌ పూర్తయిన అనంతరం ఆమె తనకు రాఖీ కడుతున్న ఫోటోను, సీఎం సహాయ నిధికి రచన రూ.లక్ష అందజేసిన సందర్భంగా ఇచ్చిన అధికారిక ధ్రువపత్రాన్ని కేటీఆర్ ట్విటర్‌లో షేర్ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10