రష్యాలోని డాగేస్తాన్ రాజధాని మఖచ్కల నగరంలో ఓ గ్యాస్ స్టేషన్‌లో జరిగిన పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందారు. సుమారు 60 మంది గాయపడ్డారు. మఖచ్కల నగరంలో ఓ ఫిల్లింగ్ స్టేషన్‌లో అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఈ నగరంలో హైవే పక్కన ఉన్న కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం అవి పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్‌కు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మంటల తీవ్రత అధికం కావడంతో పరిసర ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. 260 ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పలు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. గాయపడిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.