సాయుధ బలగాల సంక్షేమానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ‘అందరికీ ఉపాధి’ అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నినాదాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఎక్స్ సర్వీస్‌మెన్ ఉపాధి సెమినార్‌లు, ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా మార్చి 28న హైదరాబాద్ హకీంపేటలో జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీనిలో ఉత్సాహంగా పాల్గొనేందుకు తాను ఎదురుచూస్తున్నా అంటూ ప్రకటన విడుదల చేశారు. రక్షణ మంత్రిత్వ శాఖ హకీంపేటలో నిర్వహించే ఈ మేళాలో దాదాపు 2,000 ESM, దాదాపు 50 కార్పోరేట్ కంపెనీలో రావచ్చని అంచనా వేస్తున్నట్లు జి కిషన్ రెడ్డి తెలిపారు.
“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ సాయుధ దళాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానమంత్రి ‘అందరికీ ఉపాధి’.. అన్న నినాదంతో రక్షణ మంత్రిత్వ శాఖ విజన్ డాక్యుమెంట్, డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మాజీ సైనికుల సంక్షేమ శాఖ అనుబంధ కార్యాలయం ఎక్స్ సర్వీస్‌మెన్ (ESM) ఉపాధి సెమినార్‌లను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా జాబ్ మేళాలు.. ఉపాధి సెమినార్‌లు బాగా శిక్షణ పొందిన, క్రమశిక్షణ కలిగిన మాజీ సైనికులు (ESM), కార్పొరేట్లు/PSUల మధ్య వారధిగా పనిచేస్తాయి. ఇది ఇద్దరికీ పరస్పర ప్రయోజనకరమైన సంబంధాన్ని కలిగిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఇండస్ట్రీ, కార్పొరేట్‌ల సహకారంతో డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్ కేంద్రం చొరవ, మాజీ సైనికుల సంక్షేమ శాఖ ప్రోత్సాహంతో దేశానికి సేవలో తమ జీవితకాలంలో ప్రధానమైన సేవను అందించిన మాజీ సైనికులకు ఉపాధిని కల్పించడానికి అనుగుణంగా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు. హకీంపేటలో జరిగేటటువంటి జాబ్ మేళాలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి, రాబోయే కంపెనీలు, మాజీ సైనికులను ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవడానికి, అత్యంత నైపుణ్యం, అనుభవజ్ఞులు, ఆసక్తిగల మాజీ సైనికులను నియమించుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.