దేశ రైతాంగం, సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణను ప్రకటించిన బీఆర్‌ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తూ రోజురోజుకీ తన ప్రాభవాన్ని, ప్రజాదరణను పెంచుకుంటూ సాగుతున్నది. ‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బిఆర్‌ఎస్ పార్టీలో ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన నాయకులు, మేధావులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, సైనికులు, రైతు ఉద్యమాల నాయకులు చేరి మద్దతు ప్రకటించారు. దేశం పురోగతి సాధించాలంటే బిఆర్‌ఎస్ కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని వారంతా ఎలుగెత్తి చాటారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రైతుల హక్కుల సాధనకై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ‘క్రాంతికారి షేత్కారి పార్టీ’ అధ్యక్షుడు సతీష్ పాల్వే తన పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం సంచలనంగా మారింది. సోమవారం హైదరాబాద్‌లో సతీష్ పాల్వే తన పార్టీ నాయకులతో కలిసి బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ గులాబీ కండువా కప్పి, వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సతీష్ పాల్వే మాట్లాడుతూ… రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర అణగారిన వర్గాల కోసం పూర్తి స్థాయిలో పనిచేసే లక్ష్యంతో క్రాంతికారి షేత్కారి పేరుతో స్వతంత్ర రాజకీయ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. రైతాంగ సంక్షేమం- వ్యవసాయాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ప్రకటించిన బిఆర్‌ఎస్ పార్టీలో క్రాంతికారి షేత్కారి పార్టీ విలీనం చేసి, ఉజ్వల భారతదేశం కోసం బిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నట్లు సతీష్ పాల్వే ప్రకటించారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణను మహారాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పార్టీని పటిష్టపరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తానని సతీష్ పాల్వే స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు, సిఎం కేసిఆర్ శీర్వాదం తనకు సదా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.