హైదరాబాద్ : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కవితకు నేడు ఈడీ ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కవిత ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని ఈడీని లేఖ ద్వారా కోరారు. ఈ నెల 15 తరువాత విచారణకు హాజరవుతానని వెల్లడించారు. ఢిల్లీ (Delhi)లో ధర్నాకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా ఉందని.. అందుకే హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో కవిత పేర్కొన్నారు.
కాగా.. ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత నిరహార దీక్ష చేస్తారా? లేదా? అనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఆమె దీక్ష చేయనున్నారు. ఈ దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. దీక్షా కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పలు విపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొనున్నారు. కవిత దీక్షకు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హాజరుకానున్నారు. దీక్ష ముగింపునకు సీపీఐ కార్యదర్శి డి రాజా హాజరుకానున్నారు. కవిత దీక్షకు సంఘీభావంగా దేశంలోని 18 పార్టీలకు చెందిన నేతలు ఆయా పార్టీల బృందాలు పాల్గొననున్నాయి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి దీక్షలో వివిధ మహిళా సంఘాలు, మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు పాల్గొననున్నాయి. కవిత దీక్షకు ప్రత్యేకంగా రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ హాజరుకానున్నారు.