మరో ముగ్గురు నేతలకు సెక్యూరిటీ తగ్గింపు..
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి షాక్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే మాజీ ఎంపీకి గన్‌మెన్లను కుదించిన ప్రభుత్వం.. మరో ముగ్గురు నేతలకు సెక్యూరిటీని తగ్గించింది. జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గన్‌మెన్స్ కుదించింది. 2 ప్లస్ 2 నుంచి 1 ప్లస్ 1కు కుదించింది ప్రభుత్వం. అయితే గన్‌మెన్సే అవసరం లేదని వెనక్కిపంపారు కనకయ్య. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం BRSఇంచార్జి వెంకట్రావు గన్‌మెన్స్ తొలగించింది ప్రభుత్వం. దీనిపై స్పందించిన పాయం తనకిచ్చిన గన్ మెన్స్‌ను తొలగించడం ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. నాకు ఎలాంటి గన్‌మెన్లు అవసరం లేదు, సెక్యూరిటీ తీసేసినంత మాత్రాన పోయేది ఏమీ లేదు.
ప్రభుత్వంలో ఇసుక దందాలు, భూకబ్జాలు, గంజాయి మాఫియాకి అండగా ఉన్న వారికి, ప్రజలను నిండా ముంచేవారికి దోచుకునే వారికి గన్‌మెన్లు కావాలంటూ పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మరో వైపు భద్రాచలం బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ తెల్లం వెంకట్రావుకు ఉన్న గన్‌మెన్లను ప్రభుత్వం తొలగించింది. ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే స్పందించిన వెంకట్రావు.. సర్కారు నుంచి ఎలాంటి నిర్ణయం వచ్చినా.. తన ప్రయాణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటే అని ప్రకటించారు. గతంలో నేను సెక్యూరిటీ కావాలని అడగలేదు, ఇప్పుడు సెక్యూరిటీ తీసేశారు. ఇది ప్రభుత్వ కక్ష సాధింపే చర్యే అని స్పష్టం చేశారు. తనుకు ఏమి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు వెంకట్రావు. ప్రభుత్వం నిర్ణయం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చకు దారి తీసింది. పొంగులేటి వర్గాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసిందన్న విమర్శలు వినిపిస్తన్నాయి.