పాదచారులు రహదారులపై వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలని టీఎస్‌ఆర్టీసీ సూచిస్తోంది. అజాగ్రత్తగా వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని హెచ్చరిస్తోంది. కొందరు పాదచారులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే టీఎస్‌ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురువుతున్నాయని తమ పరిశీలనలో వెల్లడైందని తెలిపింది. ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు రోడ్డు ప్రమాదాల్లో 283 మంది మరణించారు. అందులో 71 మంది పాదచారులు ఉండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. రోడ్డు ప్రమాదాల బారినపడి మృతి చెందిన వారిలో 25 శాతం మంది పాదచారులే ఉండటం గమనార్హం. ప్రమాదాలు జరిగిన తీరుపై ఇటీవల టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా విచారణ చేశారు. ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్లే పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఈ విచారణలో వెల్లడైంది.
రోడ్డు ప్రమాదాల నివారణకు టీఎస్‌ఆర్టీసీ అన్ని చర్యలను తీసుకుంటోంది. దాదాపు 4 వేల మంది అద్దె బస్సు డ్రైవర్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలనూ సేప్టీ వార్డెన్లను నియమించి.. ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పడు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తోంది. కానీ.. పాదచారులు తెలిసో తెలియకో చేసే చిన్న తప్పిదాల వల్ల టీఎస్‌ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే వారికి ట్రాఫిక్ రూల్స్‌పై సరైన అవగాహన లేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకే రహదారులపై పాదచారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారించిన ప్రాణాలకే ప్రమాదం.” అని టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.