సోషల్ మీడియాలో తాను చనిపోయినట్లు వార్తలను నమ్మొద్దని సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) తెలిపారు. కావాలని అలాంటి వార్తలను ప్రచారం చేయడం బాధాకరమని ఆయన చెప్పుకొచ్చారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు కోటా పేర్కొన్నారు. సోషల్ మీడియా తాన చనిపోయినట్లు వస్తున్న వార్తలపై కోటా తాజాగా స్పందించారు.
రేపు జరుగబోయే ఉగాది పండుగ ఏర్పాట్లు చూసుకుంటున్న తనకు ఇలా వరుసగా చాలా ఫోన్ కాల్స్ రావడం ఆందోళన కలిగించిందని చెప్పారు. అదే కొంచెం పెద్ద వాళ్లైతే నిజంగా గుండె ఆగి చనిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఆ వార్తల వల్ల తన ఇంటి వద్ద భద్రత కోసం ఏకంగా 10 మంది పోలీసులు వచ్చారని కోటా బాధను వ్యక్తం చేశారు. పాపులారిటీ, డబ్బు కావాలంటే వేరే మార్గాల్లో సంపాదించుకోవచ్చని, ఇలా పుకార్లను వ్యాప్తి చేయడం మంచి కాదని హెచ్చరించారు. మనుషుల జీవితాలతో ఆడుకోవడం.. దారుణమైన విషయమని చెప్పారు. ఇలాంటి చర్యలను ప్రజలు తీవ్రంగా ఖండించాలని తెలిపారు. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని కోటా ప్రజలను, టాలీవుడ్ సినీ ప్రేక్షకులను కోరారు.