ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. గంటన్నరగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. పిళ్లై, కవితను కలిపి విచారిస్తున్నారు ఈడీ. అరుణ్ రామచంద్రపిళ్లైని కవిత బినామీగా చెబుతున్నారు ఈడీ. ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. సౌత్ గ్రూప్‌తో సంబంధాలపై ప్రశ్నలు కూడా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆప్‌కు ముట్టిన రూ.100 కోట్లపై ఆరా ఈడీ అధికారులు అడుగుతున్నట్లుగా సమాచారం. అయితే పిళ్లై కస్టడీ ఈ మధ్యాహ్నంతో ముగియనుంది. ఈలోపే కీలక సమాచారం సేకరించే యోచనలో ఈడీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
తొలుత ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దకు కవితతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, న్యాయవాది సోమ భరత్ చేరుకున్నారు. అనంతరం కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. రెండో సారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు కవిత. ఆమె వెంట ఈడీ కార్యలయానికి భర్త అనిల్, న్యాయవాది భరత్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు.. మంత్రి కేటీఆర్, భర్త అనిల్, ఎంపీలు సంతోష్, వద్దిరాజు రవిచంద్ర, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు.
ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు కూడా ఈడీ కార్యాలయం దాకా వెళ్లారు. విచారణకు ముందు మరోమారు న్యాయ నిపుణులతో చర్చించిన కవిత, తనను ఈడీ అడుగుతున్న ప్రశ్నలు ఏంటి.. వాటిని తాను ఎలా ఎదుర్కోవాలి అనేది.. వారితో చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఇక కవితతో పాటు కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకొని ఈడీ విచారణ నేపథ్యంలో చేయవలసిన దానిపై, భవిష్యత్తు కార్యాచరణ పై ఢిల్లీలోని పలువురితో చర్చించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు లతో కలిసి కవిత నివాసంలో చర్చలు జరిపారు.