చిరంజీవితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మోహన్‌బాబు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మధ్య దూరం ఉందనే మాటల్ని ఆయన ఖండించారు. వీలు కుదిరిన ప్రతిసారీ మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉంటామని ఆయన తెలిపారు.
‘‘వజ్రోత్సవాల్లో జరిగిన వివాదంపై ఆయన మాట్లాడారు ‘‘సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలెన్నో వస్తుంటాయి. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు? ప్రస్తుతం మేము ఆనందంగా ఉన్నాం. పరిస్థితులు అనుకూలింకపోతే అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయుల మధ్య చిన్న చిన్న మాటలు, పట్టింపులు వస్తుంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా మధ్య ఎలాంటి దూరంలేదు. కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.
‘మా’ ఎన్నికల విషయంలో మీ ఇద్దరి మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లు చెప్పుకొన్నారు’ అన్న ప్రశ్నకు ‘ఇప్పటికీ నాకు ఆ బాధ ఉంది. అలా ఎందుకు జరిగింది? అది తన తప్పా? నా తప్పా? అనేది ఇప్పుడు చర్చించాలనుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో మేమిద్దరం వందసార్లు ఎదురుపడ్డాం. ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుకున్నాం. బయటవాళ్లు అనుకోవడం తప్ప మా మధ్య ఎలాంటి దూరం లేదని స్పష్టం చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న విష్ణు ఇచ్చిన హామీలను చాలావరకూ పూర్తి చేశాడనీ, ‘మా’ బిల్డింగ్ ఒకటే పెండింగ్ ఉందని అన్నారు.