కాంగ్రెస్ పార్టీలో చేరికలు గాలివాటం కాదని, రాష్ట్రాన్ని కేసీఆర్ నుండి విముక్తి కలిగించేందుకు, తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేనని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక అన్నారు. ధనిక రాష్ట్రంలో ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేళ్ల పాలనలో నాశనం చేశారని దుయ్యబట్టారు.
కేసీఆర్ అరాచక పాలనను భరించే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదన్నారు. కేసీఆర్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత కూడా లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ పుట్టకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అంటున్నారని, కానీ వీరు పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టిందన్నారు. చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ పార్టీ పెట్టారని ఆరోపించారు. 22 ఏళ్ళు తెలంగాణ జెండామోసిన వారికి న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు.