ఆషాఢ బోనాల సంబరాలకు జంట నగరాలు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 22 నుంచి సంబరాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఉత్సవం లష్కర్ బోనాల జాతర. ప్రతీయేటా ఆషాడమాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ప్రజలు పండగ చేస్తుంటారు. ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల పండుగ చాలా ఘనంగా చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సం బోనాల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యేడు ఆషాడమాస బోనాలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాలను సమీక్షించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జూన్ 19 నుంచి 21 వరకు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరుగనుంది. అనంతరం 22వ తేదీ నుంచి జులై 20 వరకు భాగ్యనగరంలో ఆషాడమాస బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ఈనెల 22న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిబోనం సమర్పించనున్నారు. జులై 9న సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి జాతర, జూలై 10న రంగం కార్యక్రమం ఉంటుంది.
జులై 16న లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు జరుగనున్నాయి. జులై 20న చివరి బోనంతో నగరంలో బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.