ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించాలని.. తనను ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి చూడండని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే రెండేళ్ల తర్వాత రాజీనామా చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ చేబ్రోలులో రైతులు, చేనేత కళాకారులు, పట్టు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేనేత కార్మికులు, పట్టు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు.
జనసేన అధికారంలోకి వస్తేనే చేనేతల సమస్యలు పరిష్కారం అవుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే చేబ్రోలును సిల్క్ సిటీగా మారుస్తామని ప్రకటించారు. జీఎస్టీని తొలగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఒకవేళ జీఎస్టీని కేంద్రం తొలగించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా చేస్తామన్నారు. ఉప్పాడ నేతలకి గిట్టుబాటు కూడా రాకపోవడం తనని కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాలలో తాను చేనేత కుటుంబాల మధ్య పెరిగానని.. దశాబ్దాలుగా పట్టు రైతులు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. పదేళ్ల నుంచి అధికారం లేకపోయినా.. రోడ్ల మీద తిరిగి, ప్రజా సమస్యల్ని తాము పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.