హైదరాబాద్‌లో 8వ తరగతి విద్యార్థి అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. మల్కాజ్‌గిరిలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు హర్షవర్ధన్ నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో హర్షవర్థన్ మిసింగ్ కేసు మిస్టరీగా మారింది. హర్షవర్థన్‌ను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి సైతం రంగంలోకి దిగారు. ఆమె మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌ను వెళ్లి ఇన్‌స్పెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే బాలుడు ఆచూకీ కోసం నాలుగు టీంలు గాలిస్తున్నాయి. తమ కుమారుడిని కిడ్నాప్ చేశారని బాలుడి తల్లిదండ్రులు అంటున్నారు. ఇద్దరిపై తమకు అనుమానం ఉందని తల్లిదండ్రులు అంటున్నారు. రమేష్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. రమేష్‌కు.. హర్ష వర్ధన్ కు మధ్య గతంలో ఆర్థిక వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.