రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు నగరంలో జరగనున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య, శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వాహనదారులను దారి మళ్లించనున్నారు.
CTO జంక్షన్, PNT ఫ్లైఓవర్, జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అవుట్ గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, VV స్టాచ్యూ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, NFCL జంక్షన్లలో రాష్ట్రపతి పర్యటించే సమయంలో ట్రాఫిక్ రద్దీ ఉండనుంది. ఇక సికింద్రాబాద్ నుంచి బేగంపేట, రాజ్‌భవన్ మీదుగా అమీర్‌పేట్, మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు అప్పర్ ట్యాంక్‌బండ్ రూట్‌లో వెళ్లనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు.
ఇక మోనప్ప జంక్షన్, ఖైరతాబాద్‌లోని వీవీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వైపు వాహనానాలను అనుమతించరు. అలాగే పంజాగుట్ట-రాజ్‌భవన్ క్వార్టర్స్ మార్గంలో కూడా ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ మార్గాల్లో రోడ్డుపై ఇరువైపుల రూట్లను మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సీటీఓ జంక్షన్ మినిస్టర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పూరా జంక్షన్‌లో కొద్దిసేపు నిలిపివేయనుండగా.. పంజాగుట్ట, గ్రీన్‌లాండ్ జంక్షన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ప్రకాష్ నగర్ టీ జంక్షన్ వద్ద కాసేపు ఆపేయనున్నట్లు పేర్కొన్నారు.