వైఎస్ షర్మిలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే తెలంగాణ వాళ్లు పాలించడానికి అని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి.. పొరుగు రాష్ట్రానికి చెందిన షర్మిల వచ్చి ఇక్కడ నాయకత్వం వహిస్తానంటే ఎలా ఊరుకుంటామని అన్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్‌కి పని చేస్తే స్వాగతిస్తానని తెలిపారు. షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా పని చేస్తే.. సహచర పీసీసీ చీఫ్‌గా ఆమెను కలుస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఇక్కడ ఉన్నని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదని రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి తెలంగాణ కాంగ్రెస్‌తో వైఎస్ షర్మిల పార్టీకి ఎలాంటి పొత్తులు లేక విలీనాలు ఉండవని స్ఫష్టమవుతోంది.
కొంతకాలంగా వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని.. ఆమె తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహాగానాలు జోరుగా వినిపించాయి. పలుసార్లు వైఎస్ షర్మిల బెంగళూరు వెళ్లి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌ను కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. డీకే శివకుమార్ ద్వారా వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి.