ఓఆర్ఆర్ (ORR) లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించి ఐఏఎస్ అధికారి మే 25న ఇచ్చిన లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోవాలన్నారు. అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకు తనను అణిచివేయాలనే ఈ నోటీసు పంపారన్నారు. లీగల్ నోటీసులో పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమని మండిపడ్డారు. ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంలో రాజకీయ నాయకుడిలా అరవింద్ వ్యవహరిస్తున్నారన్నారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా రాజకీయ నాయకుడిలా ఎదురు దాడి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయడంలేదన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్ వసూలు టెండర్ ఇచ్చారన్నారు. ఐఆర్బీ సంస్థకు టెండర్ కట్టబెట్టే క్రమంలో యదేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా బేస్‌ప్రైస్‌పై అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్ నివేదికను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ ఆఫీసరును నియమించి ఓఆర్ఆర్ టెండర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారని తెలిపారు. ఎన్ని నోటీసులిచ్చినా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.