ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఉన్న ఆ షాకింగ్ వీడియోను ట్వీట్ చేసిన సజ్జనార్.. ‘యూటర్న్ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం డేంజర్ ! మీతో పాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారు. జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి.’ అని సూచించారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాలను ఆయన పేర్కొనలేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే సజ్జనార్.. టీఎస్ఆర్టీసీ కార్మికులు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు అభినందిస్తారు. అలాగే సమాజంలో జరిగే మోసాలు, ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేదానిపై సూచనలు ఇస్తారు. అలాగే ఇలాంటి వీడియోలు షేర్ చేసి వాహనదారుల్లో అవగాహన కల్పిస్తుంటారు.
ఆ వీడియోలో ఓ అమ్మాయి రోడ్డు క్రాస్ చేసేందుకు స్కూటీపై రాంగ్రూట్లో వెళ్లింది. అంతలో వారికి ఎదురుగా ఇద్దరు యువకులు తమ తమ బైకులపై వస్తున్నారు. అందులో ఓ యువకుడు స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. రాంగ్రూట్లో సడెన్‌గా ఎదురొచ్చిన ఆ అమ్మాయిని తప్పించబోయి.. ఓ యువకుడు రోడ్డు పక్కనే ఓ షాపు ముందు ఉన్న మెట్లను ఢీకొట్టాడు. అంతే అమాంతం బైక్‌తో సహా గాల్లోకి ఎగిరిపడ్డాడు. వెనుక నుంచి సవ్యంగా వస్తున్న మరో యువకుడి బైకుపై యాక్సిడెంట్‌కు గురైన బైక్ పడింది. దీంతో ఆ ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అ అమ్మాయి నిర్లక్ష్యంగా రాంగ్రూట్లో రావటం, యువకుడు కంట్రోల్ అయ్యే అవకాశం లేనంతగా బైక్‌ను స్పీడ్‌గా డ్రైవ్ చేయటం ప్రమాదానికి కారణమైంది.