తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, స్టార్ కమెడియన్ సప్తగిరి ప్రకటించారు. త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని లోక్ సభ లేదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటన చేశారు.
తనది చిత్తూరు జిల్లానే అని, ఐరాల ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టానని సప్తగిరి చెప్పారు. బంగారుపాళ్యం, పుంగనూరులో చదివానని తెలిపారు. ‘పేదల కష్టాలు నాకు తెలుసు. పేదలకు సేవ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా నా వంతు కృషి చేస్తా’ అని చెప్పారు. టీడీపీ నుంచి ఆఫర్ ఉన్నమాట వాస్తవమేనని, కాకపోతే ముందే చెప్పడం సరికాదని అన్నారు. మరో 10, 15 రోజుల్లో శుభవార్త చెబుతానని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏమి ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. టీడీపీ అధికారంలో రావడానికి తన సేవలు అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని, చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు.
చంద్రబాబు డెవలప్మెంట్ను అందరూ చూశారని.. తాను ఎన్నికల్లో పోటీచేయడంపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇప్పటికే నారా లోకేశ్ ను పాదయాత్రలో కలిశానని చెప్పుకొచ్చారు. ‘‘నిజాయితీతో సినిమా రంగంలో అవకాశాలను దక్కించుకోగలిగాను. అలాగే రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటా. సినిమా వల్లే రాజకీయంగా అవకాశాలు వచ్చాయి. సినిమాలను వదిలేసేది లేదు’’ అని తెలిపారు.