హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ అప్సర మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో నిందితుడైన పూజారి సాయికృష్ణకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా… ప్రస్తుతం అతడు చర్లపల్లి జైలులో ఉన్నాడు.
ఇదిలా ఉండగా.. అప్సర, పూజారి సాయికృష్ణ వ్యవహారంపై ఆయన తండ్రి మరోసారి స్పందించారు. అప్సరతో తన కుమారుడు సాయికృష్ణ సంబంధం పెట్టుకున్నాడన్న విషయం తమకు తెలియదని అన్నాడు. అసలు ఆమె ఎవరో ఘటన జరిగేంత వరకు కూడా తెలియదని చెప్పుకొచ్చారు. ఒకవేళ తమకు ముందే తెలిసి ఉంటే పరిస్థితి ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
“అప్సర లాంటి అమ్మాయితో మా వాడికి పరిచయం ఉన్న విషయం నాకు తెలియదు. దేవుడి సాక్షిగా చెబుతున్నా.. ఘటన జరిగేంత వరకు కూడా వీరి విషయం మా ఇంట్లో వాళ్లకు ఎవరికీ తెలియదు. విషయం నా దృష్టికి వచ్చి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. అది తెలిసి ఉంటే 10 నిమిషాల్లో సాల్వ్ చేసేవాడిని. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లేవాడిని.., ఆమె తల్లిని పిలిపించేవాడిని.. పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించి ఇది తప్పు అని చెప్పేవాడిని. గత మూడు నెలల నుంచి అప్సర విపరీతంగా టార్చర్ చేస్తుందని మా వాడు పీఎస్‌లో చెప్పాడు. అదే విషయం నాకు చెప్పి ఉంటే.. సమస్య ఇంతటి వరకు వచ్చేది కాదు. వాడు ఎంతో మందికి హెల్ప్ చేస్తాడు. అలాంటి వాడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు. ఇది బ్లండర్ మిస్టేక్. ఒక మనిషనేవాడు చేయకూడనిది చేశాడు. ఇక ఆమెకు గతంలోనే పెళ్లి జరిగిందన్న విషయం వారి కుటుంబానికి సంబంధించినది. అది మాకు అనవసరం.” అని పూజారి సాయికృష్ణ తండ్రి అన్నారు.