ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరు సంపాదించుకున్న స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా మరోసారి తండ్రయ్యారు. ఈ వార్త కోలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రభుదేవా కొన్నాళ్లు ముందు హిమానీ అనే ఆవిడను పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. హిమానీ ఫిజియో థెరపిస్ట్. వెన్ను నొప్పితో బాధపడుతున్న ప్రభుదేవాకు ఆమె ట్రీట్మెంట్ అందించారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడి..2020లో ఆమెను పెళ్లాడారు. ఈ మూడేళ్ల కాలంలో ప్రభుదేవా, హిమానీ జంట పెద్దగా బయట కనపడలేదు. ఈ జంటకు ఇప్పుడు పాప పుట్టింది. 50 ఏళ్ల వయసులో ఆయన తండ్రి కావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ అడుగు జాడల్లో నడుస్తూ సినీ రంగంలోకి అడుగు పెట్టారు. డాన్సర్‌గా స్టార్ట్ చేసిన ఆయన నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ వచ్చారు. స్టార్ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత నటుడిగా మారారు. అలాగే మెగా ఫోన్ చేతబట్టి సక్సెస్ సాధించారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ప్రభుదేవా సినిమాలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 1995లో రామలత అనే తోటి డాన్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత రామలత హిందూ మతంలోకి మారారు. వీరికి ఇద్దరు కొడుకులు. వారిలో ఓ కొడుకు చనిపోయాడు. కొన్నాళ్ల తర్వాత నయనతారతో ప్రభుదేవాకి ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకునే వరకు వెళ్లిపోయారు. ఇదే విషయంపై ప్రభుదేవా నుంచి ఆయన సతీమణి రామలత విడిపోయారు. ప్రభుదేవా సైతం నయనతారను పెళ్లి చేసుకోలేదు.