నోయిడా ఫిలిం సిటీలోని లక్ష్మీ స్టూడియోలో దారుణం చోటుచేసుకుంది. అందాల పోటీల్లో భాగంగా ఓ మోడల్ రాంప్ వాక్ చేస్తుండగా ఇనుప స్తంభం మీద పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువకుడు గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సంఘటన గురించి తెలుసుకున్న నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
అందాలపోటీ జరుగుతున్న సమయంలో అందరి దృష్టి రాంప్ మీద తళుకులీనుతున్న అందమైన మోడల్స్ మీదే ఉంది. వారంతా ఫ్యాషన్ షోలో లీనమైపోయారు. వరుసక్రమంలో రాంప్ వాక్ చేయడానికి వచ్చిన మోడల్ వంశిక చోప్రా యధాప్రకారం రాంప్ మీద నడక మొదలుపెట్టింది. అంతలోనే లైట్ల కోసం పైన అమర్చిన ఇనుప స్తంభం ఉన్నట్టుండి కూలింది.
అది నేరుగా వంశిక మీద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయారు. కొంచెం దూరంలో ఉన్న బాబీ రాజ్ అనే మరో వ్యక్తికి కూడా తీవ్రంగా గాయాలవడంతో వైద్యం నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణ నేపధ్యంలో అడిషనల్ డిసిపి మోహన్ అశ్వతి మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో మృతి చెందిన మోడల్ వంశిక చోప్రాగా గుర్తించాం. ఆమె మరణం గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాము. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించాం. ఈవెంట్ నిర్వహిస్తున్న వ్యక్తి తోపాటు లైటింగ్ అమర్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.