నిజామాబాద్‌లో యువతికి వింత అనుభవం
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. గతేడాది జరిగిన గ్రూప్ -1 పరీక్షల్లో పేపర్ లీక్ జరగ్గా.. ఆ పరీక్షను రద్దు చేసి తిరిగి ఆదివారం మరోసారి పరీక్షలు నిర్వహించారు. అయితే ఓ యువతికి విచిత్ర అనుభవం ఎదురైంది. తాను గ్రూప్ -1 పరీక్షకు అప్లై చేసుకోకుండానే ఆమెకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా మేసేజ్ వచ్చింది. అది చూసిన ఆమె.. లింక్ ఓపెన్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుంది. అది చూసి ఆమె షాక్‌కు గురైంది. అప్లై చేయకుండానే హాల్‌టికెట్ ఎలా వచ్చిందని కన్ఫ్యూజన్‌కు గురైంది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన సుచిత్ర పోటీ పరీక్షలకు సన్నద్దమవుతుంది. ఆమె గ్రూప్ -3, గ్రూప్ -4 పరీక్షలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నారు. అయితే ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ ఆమెకు టీఎస్‌పీఎస్సీ అధికారులు పంపించారు. అది చూసిన ఆమె ఖంగుతున్నారు. “నేను అప్లయ్ చేయని ఎగ్జామ్‌కు హాల్‌టికెట్ వచ్చింది. నిజామాబాద్‌లో సెంటర్ పడినట్లు చూపించింది. నేను అప్లై చేయని దానికి, ఫీజు పే చేయనిదానికి హాల్ టికెట్ వచ్చింది. నేను ఆ ఎగ్జామ్‌కు ప్రిపేర్ కాలేదు. వెల్దామనుకున్నా.. కానీ వస్తదో రాదోనని వెళ్లలేదు. పీజీ ఎగ్జామ్ రాద్దామని అప్లయ్ చేస్తే.. ఎలాంటి హాల్ టికెట్ రాలేదు. కానీ నేను అప్లయ్ చేయని గ్రూప్ -1కు హాల్‌టికెట్ వచ్చింది. అది చూసి నేను కన్ఫ్యూజ్ అయ్యా. అప్లై చేసిన గ్రూప్ 3, 4 కు ఇంకా హాల్‌టికెట్ రాలేదు.” అని సుచిత్ర అన్నారు.