ప్రధాని మోదీ గడిచిన తొమ్మిదేళ్లుగా అభివృద్ధి రాజకీయాలు చేశారని బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లుగా మోదీ ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తుంటే 2024లోనూ కేంద్రంలో మోదీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అందరి అభివృద్ధి కోసం మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ చేపట్టిన మహాసంపర్క్ అభియాన్‌లో భాగంగా ప్రకాశ్ జవదేకర్ కరీంనగర్ వచ్చారు. మోదీ ప్రభుత్వ విశేషాలను జవదేకర్ వివరించారు. 24 గంటలు పనిచేస్తున్న ప్రభుత్వం ఇదని కొనియాడారు. కుటుంబపాలన అన్నది కేంద్రంలో లేదని స్పష్టం చేశారు.
ఇదిలావుంటే.. ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభ సభలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు అమిత్‌షా. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. అయితే.. విశాఖ సభలో అమిత్ షా ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దాంతో.. అమిత్ షా ప్రసంగంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. విశాఖ సభలో నడ్డా ప్రసంగానికి కొనసాగింపుగా అమిత్‌షా స్పీచ్ ఉంటుందా?.. అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.